నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి.. నమ్మకండి: సీనియర్ నటుడు చంద్రమోహన్..
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు
- నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
- అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ పేరుగాంచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ రాజ్యమేలుతున్న కాలంలో యువకుడిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఆయన… హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. అయితే, చంద్రమోహన్ ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందిస్తూ… వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తన ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతోందని చంద్రమోహన్ చెప్పారు. తనకు బాగోలేదని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అందరి అభిమానమే తనకు శ్రీరామ రక్ష అని అన్నారు.