- జర్మనీ నుంచి ఈజిప్టుకు వెళ్తున్న నౌక
- నౌకలో దాదాపు 3 వేల కార్లు
- ఎలక్ట్రిక్ కార్ల వల్లే ప్రమాదం
- సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న 23 మంది.. ఒకరి మృతి
- మంటలు కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం
దాదాపు 3 వేల కార్లతో జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. డచ్ తీరంలో జరిగిన ఈ ప్రమాదంలో అందులో ఉన్న కార్లన్నీ బుగ్గిపాలైనట్టు తెలుస్తోంది. అలాగే, ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. నౌకకు అంటుకున్న మంటలు కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని కోస్ట్‌గార్డ్ తెలిపింది.
పనామాలో రిజిస్టర్ అయిన 199 మీటర్ల పొడవున్న ఫ్రెమాంటల్ హైవే నౌకలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. అవి అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో అందులోని సిబ్బంది సముద్రంలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. నౌకలోని ఎలక్ట్రిక్ కార్ల వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని నౌక యజమాని అనుమానం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ షిప్‌లు నౌక వద్దకు చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, మంటలు ఆర్పేందుకు ఎక్కువ నీటిని ఓడపైకి స్ప్రే చేస్తే అది మునిగిపోయే ప్రమాదం ఉందని డచ్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. డెక్‌పై కాకుండా పక్కలకు మాత్రమే నీటిని స్ప్రే చేస్తున్నట్టు వివరించింది.
నౌకలో మంటలు ఎగసిపడడాన్ని గమనించిన అందులోని 23 మంది సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మంటలు క్షణక్షణానికి విస్తరిస్తుండడం, పొగ కమ్మేస్తుండడంతో ప్రమాదాన్ని శంకించి సముద్రంలోకి దూకేశారు. అప్పటికే సమాచారం అందుకున్న హెలికాప్టర్ వారిని రక్షించింది. వారంతా శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఎదుర్కోవడంతోపాటు కాలిన గాయాలు, ఎముకలు విరిగి బాధపడుతున్నట్టు డచ్ అధికారులు తెలిపారు. వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.