Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్.. కలిసేందుకు పవన్ కల్యాణ్‌కు అనుమతి నిరాకరణ!

  • చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ అనుమతి లేదన్న పోలీసులు
  • టీడీపీ కార్యకర్తల అడ్డగింత మధ్య తాడేపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత కాన్వాయ్
  • మంగళగిరిలో పలుచోట్ల అడ్డుకున్న టీడీపీ కేడర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పోలీసులు అనుమతిని నిరాకరించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, చంద్రబాబును కలవాలని జనసేనాని భావించారు. కానీ ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు మినహా ఎవరికీ అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

విజయవాడలో శాంతిభద్రతల సమస్య ఉందని చెబుతూ పోలీసులు జనసేనానికి మెయిల్ పంపించారు. దీంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలోనే పవన్‌ను నిలిపివేశారు. దీంతో బేగంపేట నుండి పవన్ కాన్వాయ్ వెనుదిరిగింది. ప్రత్యేక విమానం కోసం డీజీసీఏ నుండి జనసేన ముందే అనుమతి తీసుకుంది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చిలకలూరిపేట మొదలు ప్రతిచోట టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తూ నిరసన తెలుపుతున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం, ఆ తర్వాత జనసేన కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు కాన్వాయ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకుంది.

చంద్రబాబు తరఫున రంగంలోకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. లూథ్రా తన బృందంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫున బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తారు. టీడీపీ అధినేత కేసులను సిద్ధార్థ లూథ్రానే చూస్తున్నారు. గతంలో అమరావతి భూముల కేసులను వాదించారు. మరోవైపు సిట్ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును మరికాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. తొలుత ఆయనను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి, ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు.

 చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. టీవీలో వస్తున్న వార్తలను చూసి అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు గుండె ఆగి చనిపోయారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వడ్డే ఆంజనేయులు చనిపోయారు. ఆయన గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ గా ఉన్నారు. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లి వచ్చి టీవీలో అరెస్ట్ వార్తలను చూసి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన టీడీపీ నేత మైలా శివయ్య కూడా గుండెపోటుతో మృతి చెందారు. టీవీలో వార్తలు చూస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు.

Related posts

కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ విజయమ్మ ప్రత్యేక సందేశం… వీడియో షేర్ చేసిన షర్మిల

Ram Narayana

మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్నులు వీళ్ల చేతికి ఎలా వచ్చాయో తేల్చుకుంటా: లోకేశ్

Ram Narayana

అక్టోబర్ 25 నుంచి బస్సుయాత్ర.. మార్చిలో ఎన్నికలు.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో: సీఎం జగన్

Ram Narayana

Leave a Comment