- ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్
- నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు
- ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేతపై… సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించింది.
2021లో ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదయింది. నాటి ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు. చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు.