Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిజాన్ని నిగ్గు తేల్చేందుకు కెనడాకు భారత్ సహకరించాలి: అమెరికా

నిజాన్ని నిగ్గు తేల్చేందుకు కెనడాకు భారత్ సహకరించాలి: అమెరికా
దేశాంతర అణచివేతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆంటోనీ బ్లింకెన్ ప్రకటన
కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని సూచన
తుది ఫలితం రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి

భారత్ పై కెనడా చేసిన ఆరోపణల విషయంలో అమెరికా మరోమారు స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో దర్యాప్తునకు గాను కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచించారు. ఈ విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటూ అమెరికా మొదట తన స్పందన తెలియజేసింది. ఇప్పుడు మరోసారి ఈ అంశంలో భారత్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని ప్రదర్శించింది.

ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తొలిసారిగా స్పందించారు. తాము ఈ విషయమై భారత్, కెనడాతోనూ సంప్రదింపులు చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. ‘‘మేము జవాబుదారీ కోరుకుంటున్నాం. దర్యాప్తు యథాప్రకారం కొనసాగి, తుది ఫలితం రావాలి. మా భారత మిత్రులు ఈ దర్యాప్తునకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులతో బ్లింకెన్ మాట్లాడారు.

కెనడా చేసిన ఆరోపణల సారాంశంలోకి వెళ్లకుండా.. దేశాంతర అణచివేతను అమెరికా చాలా చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దీనిపై తాము ఎంతో అప్రమత్తంగా ఉంటామన్నారు. ‘‘ఇది చాలా ముఖ్యమైనది. అంతర్జాతీయ సమాజంలో ఏ దేశమైనా అలాంటి చర్యల్లో పాలు పంచుకోకూడదు’’ అని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ ప్రకటనకు ముందు అమెరికా విదేశాంగ శాఖ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. భారత్ తో తమ బంధం ఎంతో ముఖ్యమైనదంటూ.. అదే సమయంలో కెనడా ఆరోపణల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కెనడాకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశాల్లో అమెరికా కూడా ఒకటి. దీంతో తన మిత్ర దేశాన్ని సంతుష్టపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

భారత్ పై బురద జల్లడాన్ని కొనసాగిస్తున్న కెనడా ప్రధాని

ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యోదంతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై తన దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యలో భారత్ ప్రభుత్వ ప్రమేయానికి సంబంధించి విశ్వసనీయమైన ఆరోపణలను కొన్ని వారాల ముందే భారత్ తో పంచుకున్నామని తాజాగా ఆయన ప్రకటించారు. శుక్రవారం మరోసారి ట్రూడో మీడియాతో మాట్లాడారు. ”సోమవారం నేను మాట్లాడిన దాని గురించి కొన్ని వారాల ముందే భారత్ తో పంచుకున్నాం. భారత్ తో కలసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు చూస్తున్నాం. భారత్ మాతో కలసి పనిచేస్తుందని భావిస్తున్నాం. అప్పుడు ఈ అంశంలో మరింత ముందుకు వెళ్లొచ్చు’’ అని ట్రూడో పేర్కొన్నారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయానికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ జస్టిన్ ట్రూడో గత సోమవారం కెనడా పార్లమెంటుకు వెల్లడించడం తెలిసిందే. అనంతరం భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్, కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశ బహిష్కరణ చేస్తూ, కెనడా వాసులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం ఉప్పు నిప్పుగా మారిపోయింది.

కెనడా-భారత్ లలో ఎవరో ఒకరే అంటే.. అమెరికా ఎంపిక ఎలా ఉంటుందంటే..!

కెనడా నిప్పుతో చెలగాటం ఆడుతోందా..? కెనడా వైఖరిని చూస్తుంటే నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్పి, భారత్ ను కెనడా ప్రధాని ఇరకాటంలోకి నెట్టడం తెలిసిందే. ఈ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా అమెరికా, ఇతర మిత్ర దేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ప్రధాని ట్రూడో ప్రయత్నించారు. దీనిపై అమెరికా ఆందోళన సైతం వ్యక్తం చేసింది. దర్యాప్తులో నిజాలు వెలుగు చూసేందుకు వీలుగా భారత్ సహకారం అందించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో.. ఒకవేళ కెనడా, భారత్ లో ఏదో ఒక దేశం వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమెరికా ఎవరి పక్షాన ఉంటుంది..? దీనికి అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తనదైన విశ్లేషణ ఇచ్చారు. రెండింటిలో భారత్ నే అమెరికా ఎంపిక చేసుకుంటుందన్నారు. వ్యూహాత్మకంగా కెనడా కంటే భారత్ ఎంతో ముఖ్యమైన దేశం అవుతుందని చెప్పారు. పైగా నిజ్జర్ ఉగ్రవాది అని స్పష్టం చేశారు. భారత్ తో పోరుకు కెనడా మొగ్గు చూపడం.. ఏనుగుపై చీమ యుద్ధం ప్రకటించడమే అవుతుందన్నారు.

Related posts

మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్…

Drukpadam

మలయాళంలో ట్వీట్ చేసిన దుబాయ్ రాజు.. అరబిక్ లో రిప్లై ఇచ్చిన కేరళ సీఎం!

Drukpadam

కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

Drukpadam

Leave a Comment