- విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానన్న జగన్
- వైజాగ్ ఐటీ హబ్ గా మారుతోందని వ్యాఖ్య
- ఇప్పటికే వైజాగ్ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్న సీఎం
తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. డిసెంబర్ లోగా వైజాగ్ కు వచ్చేస్తున్నానని తెలిపారు. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కాసేపటి క్రితం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తాను వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నట్టు తెలిపారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరి వైజాగ్ ఐటీ హబ్ గా మారుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని… ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని అన్నారు. వైజాగ్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.