ప్రజలకు భరోసా ఇవ్వగలిగామన్న తృప్తి ఉంది : సీఎం జగన్…
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన సీఎం జగన్
సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు
ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా సిద్ధంగా ఉన్నా
ప్రత్యేక పుస్తకం రూపకల్పన
తాడేపల్లిలో ఆవిష్కరించిన సీఎం జగన్
హాజరైన మంత్రులు, అధికారులు
సోషల్ మీడియాలోను సీఎం జగన్ స్పందన
హామీలన్నీ నెరవేర్చుతున్నామని వెల్లడి
ప్రజలకు భరోసా ఇవ్వగలిగామని వివరణ
తమపై ఏ నమ్మకం ఉంచి ప్రజలు అధికారం కట్టబెట్టారో అది నిలబెట్టుకుందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్న తృప్తి ఉందని ఏ ఆపద వచ్చిన జగన్ ఉన్నాడనే భరోసా ఇవ్వగలిగామన్న ఆనందం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు
ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లయిన సందర్భంగా తీసుకువచ్చిన ప్రత్యేక పుస్తకాన్ని వైఎస్ జగన్ నేడు ఆవిష్కరించారు. తాడేపలి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గ సహచరులు, అధికారుల సమక్షంలో సీఎం జగన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సహకారంతో దిగ్విజయంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నామని చెప్పారు.
ఈ రెండేళ్ల కాలంలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. వాటిలో 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలోని 86 శాతం ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ది పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 1.64 కోట్ల నివాస గృహాలు ఉంటే, వాటిలో 1.41 కోట్ల గృహాలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు ప్రజలకు మేలు చేశానన్న సంతృప్తి ఉందని, మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
ఏపీ సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ సోషల్ మీడియాలోను స్పందించారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతూ వచ్చామని వెల్లడించారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు…. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు… మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని వివరించారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగామని సీఎం జగన్ తెలిపారు.
మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఇంకా మంచి చేయడానికి మరింత తాపత్రపడతానని వివరించారు. ప్రజలు అందించిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి అంటూ స్పష్టం చేశారు.