ఏపీ డీజీపీ ని వదలని సైబర్ నేరగాళ్లు ……
ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు
డీజీపీ ఫొటో పెట్టి దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు
ఫేక్ అకౌంట్ ను ఫాలో అవుతున్న పలు జిల్లాల ఎస్పీలు
కేసు నమోదు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. మరోవైపు అదే టెక్నాలజీని వాడుతూ, జనాలను అందినకాడికి దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. వీరి బారిన రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా పడ్డారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతాను తెరిచారు. గౌతమ్ సవాంగ్ పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచి… ఆయన ఫొటో పెట్టి దందాకు తెరలేపారు.
ఈ ఖాతా నుంచి పలు ట్వీట్లు కూడా చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అది నిజంగా డీజీపీ ఖాతానే అనుకుని పలు జిల్లాల ఎస్పీలు కూడా ఆ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు. అయితే చివరకు దీన్ని డీజీపీ కార్యాలయం గుర్తించింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై దృష్టి సారించారు.