- మూడు రోజులుగా ఇదే తీరు
- భయంతో నివాసాలను ఖాళీ చేస్తున్న స్థానికులు
- కొట్టుకుపోయిన కార్లు.. పలువురికి గాయాలు
కాలిఫోర్నియాలో మూడు రోజులుగా తీర ప్రాంతాల్లోని నివాసాలపై రాకాసి అలలు ఎగసిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అలలు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో విరుచుకుపడుతుండడంతో స్థానికులు నివాసాలను ఖాళీ చేస్తున్నారు. అలల దాటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వెంచురాలో సముద్రపు అలలు 10 మందిని లోపలికి ఈడ్చుకెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. అలల తాకిడి కారణంగా మరో 8 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలు వాహనాలు కొట్టుకుపోయాయి.
అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో అధికారులు తీర ప్రాంతాలను మూసివేశారు. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటిమరీ అలలు ఎగసిపడుతున్నాయి. గురువారం నుంచి చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావం కారణంగానే అలలు ఎగసిపడుతున్నట్టు తెలుస్తోంది.