- 54.16 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు ఎగబాకిన భారత్
- మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిన దక్షిణాఫ్రికా
- 5 నుంచి 6వ స్థానానికి దిగజారిన పాకిస్థాన్
కేప్‌టౌన్ టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో రోహిత్ శర్మ సేన మొదటి స్థానానికి ఎగబాకగా 50 శాతం పాయింట్లతో సౌతాఫ్రికా రెండవ స్థానానికి పడిపోయింది. ఇక 45.83 శాతం పాయింట్లతో పాకిస్థాన్ ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్ (3), ఆస్ట్రేలియా (4), బంగ్లాదేశ్ (5) వరుస స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7), ఇంగ్లండ్(8), శ్రీలంక (9) స్థానాల్లో ఉన్నాయి. కాగా పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఫలితం ఆధారంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కాగా కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డులకు ఎక్కింది. ఈ గెలుపుతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమానమైంది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ కలిసి ఈ మ్యాచ్‌లో ఏకంగా 15 వికెట్లు తీశారు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా, బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 61 పరుగులకు 6 వికెట్లు పడగొట్టగా, సిరాజ్ కూడా 1 వికెట్ తీసిన విషయం తెలిసిందే.