- రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి
- మూడు అంతస్తులలో మందిర నిర్మాణం.. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి
- ఈ ఏడాది డిసెంబర్ లోగా ఆలయం నిర్మించాలని డెడ్ లైన్
అయోధ్య రామమందిరంలో సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీనికోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూజలు వారం రోజులుగా నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తుది అంకం జరగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన తెల్లారి.. అంటే మంగళవారం (ఈ నెల 23) నుంచే రామమందిరంలో మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
రామమందిరాన్ని మూడు అంతస్తులలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. మిగతా రెండు అంతస్తులను ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తిచేయాలని నిర్మాణ కమిటీ డెడ్ లైన్ పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పనులు జరిపించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గడువులోగా మందిర నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగిన తెల్లవారి నుంచే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.