- కొన్ని పార్టీలు ఇష్టానుసారం హామీలు ఇస్తున్నాయని వెంకయ్య విమర్శలు
- ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు సరికాదని వ్యాఖ్య
- నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారిందని విమర్శ
ఎన్నికల్లో విజయం సాధించడం కోసం దాదాపు అన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఇష్టానుసారం హామీలను ఇస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం వంటివి ఉచితంగా ఇవ్వడంలో తప్పు లేదన్నారు. కానీ, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పారు. హామీలు అమలు చేయడానికి నిధులు లేక… మళ్లీ అప్పులు చేయడం సరికాదని అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్యనాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేతలు పార్టీలు మారడం ఒక ట్రెండ్ గా మారిందని ఆయన విమర్శించారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదని… ఒక పార్టీ నుంచి గెలుపొంది, పదవికి రాజీనామా చేయకుండా మరొక పార్టీలోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.