Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

అలా అయితే భారత్ నుంచి నిష్క్రమిస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టీకరణ…

  • 2021 ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ మెటా పిటిషన్లు
  • ప్రైవసీ నిబంధనల కారణంగానే వాట్సాప్ యూజర్ల నమ్మకం చూరగొందని వ్యాఖ్య
  • మెసేజీల ఎన్‌క్రిప్షన్ తొలగించాలని పట్టుబడితే భారత్‌ను వీడక తప్పదని వ్యాఖ్య

మెసేజీల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కోరినప్పుడు తొలగించాలంటూ బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేశాయి. 2021 నాటి ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో గురువారం కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి. 

2021 ఐటీ మార్గదర్శకాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీల ఎన్‌క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం అప్పట్లో ఐటీ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ నిబంధన పాటించడం కుదరదని వాట్సాప్, మెటా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ సమాచారం కోరుతోందో ముందుగా తెలీదు కాబట్టి తాము ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీ మూలాలు కనిపెట్టేందుకు వీలుగా కోట్లల్లో మెసేజీలను ఏళ్ల తరబడి సోర్ట్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఈ విషయమై వాదులు, ప్రతివాదుల మధ్య మరింత చర్చ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అన్న కోర్టు ప్రశ్నకు బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ లేవని మెటా తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే, ప్రైవసీ అనేది అనుల్లంఘనీయం కాదన్న కోర్టు.. అవసరాలకు హక్కులకు మధ్య సమతౌల్యం ఉండాలని పేర్కొంది. 

కేంద్రం తరపు న్యాయవాదులు ఈ మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. అభ్యంతర కంటెంట్, ఉగ్రవాదం, సమాజంలో హింసకు కారణమయ్యే కంటెంట్ మూలాలు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు. 

2021 ఐటీ మార్గదర్శకాలకు సవాలు చేస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు తొలుత సుప్రీం కోర్టుకు చేరాయి. అయితే, సర్వోన్నత న్యాయస్థానం వీటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ మార్చి 22న ఆదేశాలు జారీ చేసింది.

Related posts

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు!

Ram Narayana

హైకోర్టులో కేసీఆర్‌కు భారీ షాక్.. రిట్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..

Ram Narayana

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా..

Ram Narayana

Leave a Comment