- ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలపై చర్చ
- ముష్టిఘాతాలు, పిడిగుద్దులు, తోపులాటలతో యుద్ధరంగాన్ని తలపించిన పార్లమెంట్
- అధ్యక్షుడు చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఘటన
తైవాన్ పార్లమెంట్ శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఎంపీల పరస్పర ముష్టిఘాతాలు, తన్నులు, దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. సంస్కరణల విషయంలో జరిగిన చర్చ చివరికి ఇలా ముగిసింది. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలు ఫైళ్లు దొంగిలించి పార్లమెంటు వెలుపలకి పరుగులు పెడుతున్న వీడియోలతోపాటు సభలో ముష్టిఘాతాలు కురిపించుకుంటున్న ఎంపీల వీడియోలు వైరల్ అయ్యాయి.
ఎంపీలు స్పీకర్ చుట్టూ చేరడం, కొందరు టేబుళ్ల పైకెక్కి దూకడం, మరికొందరు సహచరులను నేలపై ఈడ్చుకెళ్తుండడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఘటన ఆ తర్వాత సద్దుమణిగింది. శాసనసభ మెజారిటీ లేకున్నా సరే సోమవారం అధ్యక్షుడిగా ఎన్నికైన చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.