- ప్రతిపాదించిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్
- ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్యేలు
- మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశం
జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.
ఈ భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వారితో చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారని పురందేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.