Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

హత్రాస్ ముమ్మాటికీ కుట్రే … కోర్టులో భోలే బాబా లాయర్..

యూపీలోని హత్రాస్ లో నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 118 మృతదేహాలను గుర్తించామని, పోస్ట్ మార్టం చేసి బాధిత కుటుంబాలకు అప్పగించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. అయితే, ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. నిన్నటి వరకు భోలే బాబాపై అంతులేని విశ్వాసం చూపిన వారే నేడు ఆయనపై అంతులేని ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు.

ఈ దారుణం జరిగిన తర్వాత పరారైన భోలే బాబా వెంటనే తమ ముందుకు రావాలని, అయినవాళ్లను కోల్పోయిన తమ ఆవేదనను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. బాబాకు నిజంగా శక్తులు ఉంటే, ఆయన వెంటనే వచ్చి తమ బాధను పోగొట్టాలని అంటున్నారు. ఇప్పటికీ తమ వాళ్ల ఆచూకీ తెలియక చాలా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. మార్చురీలో ఐదు మృతదేహాలు ఎవరివనేది గుర్తించలేకపోతున్నామని డాక్టర్లు చెప్పారు. ఆ మృతదేహాలు ఎవరివనేది తేలేంత వరకూ అటాప్సీ చేయబోమని వివరించారు.

తొక్కిసలాట జరిగిన తర్వాత నుంచి కనిపించకుండా పోయిన భోలే బాబా నిజానికి మెయిన్ పురి ఆశ్రమంలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఆశ్రమంలోని రహస్య గదిలో బాబా తలదాచుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫూల్ రయీ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ తర్వాత బాబా నేరుగా మెయిన్ పురి ఆశ్రమానికి చేరుకున్నాడని, ఆశ్రమంలోకి బాబా ప్రవేశిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెబుతున్నారు. బాబా ఆశ్రమంలోనే ఎక్కడో దాక్కుని ఉంటాడని ఆరోపిస్తున్నారు.

బాబా లాయర్ ఏమంటున్నారంటే..
ఫూల్ రయీ గ్రామంలో సత్సంగ్ నిర్వహించేందుకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని భోలే బాబా లాయర్ ఏపీ సింగ్ చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. సత్సంగ్ వేదిక వద్ద నుంచి బాబా వెళ్లిపోయిన కొన్ని నిమిషాల తర్వాత ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని వివరించారు. దీని వెనక ముమ్మాటికీ సంఘ విద్రోహుల కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

80 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా దానికి మూడు రెట్లు అంటే 2.5 లక్షల మంది భక్తులు రావడంపై మీడియా ప్రశ్నించగా.. గత కొన్ని నెలలుగా బాబా సత్సంగ్ నిర్వహించలేదని సింగ్ వివరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి జులై వరకు బాబా ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని తెలిపారు. ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి సత్సంగ్ కావడంతో తాము ఊహించినదానికన్నా జనం ఎక్కువగా వచ్చారని చెప్పారు. సభావేదిక ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లు ఉన్నాయన్న ఆరోపణలను సింగ్ కొట్టిపారేశారు. భక్తుల రాకపోకల కోసం చాలా గేట్లు ఏర్పాటు చేశామని వివరించారు. తొక్కిసలాటకు సంబంధించిన ఫొటోలు కానీ వీడియోలు కానీ ఎవరి దగ్గరైనా ఉంటే అధికారులకు అందజేసి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్!

Ram Narayana

కర్ణాటక విధాన సౌధను గోమూత్రంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. !

Drukpadam

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల్లో 1644 మంది నేరచరితులు..

Ram Narayana

Leave a Comment