Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్!

  • 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సోరెన్
  • ప్రమాణం చేయించిన గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్
  • కార్యక్రమానికి హాజరైన కూటమి నేతలు

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దీంతో హేమంత్ సోరెన్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరహాబాద్ మైదానంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

హేమంత్ సోరెన్ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అతనిని అరెస్ట్ చేసింది. సీఎం పదవికి రాజీనామా చేసిన అతను ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2, ఏజేఎస్‌యూపీ, లోక్ జన శక్తి పార్టీ (రాంవిలాస్ పాశ్వాన్), జేఎల్‌కేఎం, జేడీయూ పార్టీలు ఒక్కో సీటు చొప్పున గెలిచాయి.

Related posts

11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసిన కేంద్రం… ఎందుకంటే…!

Ram Narayana

బీజేపీ అడ్డదిడ్డ పాలనకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యం కావాలి …కేసీఆర్ ,కేజ్రీవాల్ పిలుపు ..

Drukpadam

ఆక్రమించుకోవడానికి కర్ణాటక సీఎం సీటు ఖాళీగా లేదు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య!

Ram Narayana

Leave a Comment