లోకనాయకగన్ @150
- తమిళనాట డోకాలేని విజయ్ … శాసనసభలో బలం 150 కి చేరిక
చీలిన అన్నాడీఎంకే …షణ్ముగం వర్గంవైపు 30 మంది ఎమ్మెల్యేలు
వారంతా టీవీకేకు మద్దతు …పార్టీ బలోపేతం కోసం ఈ నిర్ణయమన్న షణ్ముగం - తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే వర్గం మద్దతు
- పార్టీని పునరుజ్జీవింపజేసేందుకే ఈ నిర్ణయమన్న సీవీ షణ్ముగం
- డీఎంకేతో పొత్తు ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు వెల్లడి
- వరుస ఓటముల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్న రెబల్స్
- ఈ మద్దతుతో విజయ్ ప్రభుత్వానికి మరింత పెరిగిన రాజకీయ స్థిరత్వం
తమిళ రాజకీయాల్లో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే ప్రభుత్వంకు బొటాబొటి మెజార్టీ ఉండటంతో రాజకీయాలకు కొత్తవాడైన విజయ్ ప్రభుత్వం ఉంటుందా …చేసిన వాగ్దానాలు నెరవేరుస్తుందా…? అని అనుమానాల నేపథ్యంలో అన్నాడీఎంకే చీలికవర్గంలోని 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది .. నేడు శాసనసభలో జరిగిన స్పీకర్ ఎన్నికల్లో టీవీకేకు మద్దతుగా నిలిచారు ..ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో ఆశక్తికరంగా మారాయి…. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమికి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకేలోని సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం మంగళవారం తమ మద్దతును ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కానున్నట్లు షణ్ముగం మీడియాకు తెలిపారు.
గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో మూడుసార్లు, గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “పార్టీని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉంది. దాని భవిష్యత్తు గురించి చర్చించాలి” అని ఆయన అన్నారు. టీవీకేను అధికారంలోకి రాకుండా ఆపేందుకు, డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం పళనిస్వామి (ఈపీఎస్) చేసిన ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని షణ్ముగం స్పష్టం చేశారు.
“మనం డీఎంకేకు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించాం. 53 ఏళ్లుగా మన రాజకీయాలు డీఎంకేకు విరుద్ధంగానే సాగాయి. అలాంటిది డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మా సభ్యుల్లో మెజారిటీ వర్గం తిరస్కరించింది. ఒకవేళ అలాంటి పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడే ఉండేది కాదు” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, అన్నాడీఎంకేను చీల్చే ఉద్దేశం తనకు లేదని షణ్ముగం స్పష్టం చేశారు. “ప్రస్తుతం మేం ఎలాంటి పొత్తు లేకుండా ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అందుకే ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ 5 సీట్లతో మద్దతివ్వగా, రెండు వామపక్ష పార్టీలు (4), వీసీకే (2) మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఈ పార్టీలన్నీ డీఎంకేకు దీర్ఘకాల మిత్రపక్షాలు కావడంతో ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. తాజాగా షణ్ముగం వర్గం మద్దతుతో విజయ్ సర్కారుకు రాజకీయంగా మరింత స్థిరత్వం లభించినట్లయింది.
షణ్ముగం నివాసానికి విజయ్… అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ

- తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష
- విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు
- పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి
తమిళనాడు రాజకీయాల్లో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. రేపు (మే 13) జరగనున్న ఫ్లోర్ టెస్ట్ కు ముందు అన్నాడీఎంకేలో చీలిక రావడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మెజారిటీ మార్క్ (118)కు కొద్దిగా దూరంలో నిలిచిన టీవీకే అధినేత విజయ్ క్రమంగా పలు పార్టీల నుంచి మద్దతు లభించింది. రేపు (మే 13) బలపరీక్ష నేపథ్యంలో, అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం నాయకత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం సంచలనం రేపింది. తాజాగా రెబల్ నేత షణ్ముగం ఇంటికి విజయ్ స్వయంగా వెళ్లారు. షణ్ముగం, వేలుమణి సహా 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, మంత్రి పదవుల కేటాయింపుపై ఈ భేటీలో విజయ్ చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామం విజయ్ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది.
పార్టీపై పట్టు కోల్పోయిన పళనిస్వామికి ఇప్పుడు కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఆయన అనుసరించిన మొండి వైఖరే పార్టీలో అసంతృప్తికి, తాజా చీలికకు ప్రధాన కారణమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. షణ్ముగం, వేలుమణి వంటి కీలక నేతలు విజయ్ వైపు మొగ్గు చూపడంతో అన్నాడీఎంకే ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.