ఏపీ హైకోర్టు వార్తలు

వెంకట్రామిరెడ్డి ఉద్యోగ తొలగింపు కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు…

  • ఉద్యోగం నుంచి తొలగింపును హైకోర్టులో సవాల్ చేసిన వెంకట్రామిరెడ్డి
  • ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • జూన్ నెలకు తదుపరి విచారణ వాయిదా
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏప్రిల్‌లో తొలగింపు

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానని గతంలో ప్రకటించిన ఆయన, అన్నంత పనీ చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో పాటు విచారణాధికారిగా వ్యవహరించిన కడప జిల్లా కలెక్టర్‌కు కూడా నోటీసులు పంపింది. తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ డి. రమేశ్‌ తెలిపారు. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని వెంకట్రామిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు.

వివాదం నేపథ్యం ఇదే..
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మార్చి 31న కడప జిల్లాలోని పలు పీటీడీ (ప్రజా రవాణా శాఖ) డిపోల్లో ఆయన రాజకీయ ప్రచారం నిర్వహించారని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఈసీ సీరియస్‌గా స్పందించింది.

ఈ ఫిర్యాదుపై స్పందించిన కడప జిల్లా కలెక్టర్, ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, కడప కలెక్టర్‌నే విచారణాధికారిగా నియమించింది. సుదీర్ఘ విచారణ జరిపిన కలెక్టర్, వెంకట్రామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారిస్తూ 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఏపీపీఎస్‌సీ అనుమతితో ఈ ఏడాది ఏప్రిల్ 20న ఆయన్ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులనే ఆయన ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేశారు.

Related posts

ఆర్ఈటీపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు…

Ram Narayana

 పిన్నెల్లి సోదరులకు నిరాశ.. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరణ…

Ram Narayana

జర్నలిస్ట్ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

Ram Narayana