- తాము చెప్పిన వాటిని కేంద్రం పెద్దలు సావధానంగా విన్నారన్న డిప్యూటీ సీఎం
- కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించారని వెల్లడి
- చంద్రబాబుతో భేటీకి సంబంధించి అజెండాను రూపొందించామన్న భట్టి
భద్రాచలం వద్ద ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను వారు కలిశారు. తెలంగాణకు సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టివిక్రమార్క… కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల జాబితాను వెల్లడించారు. ఏపీలోని ఐదు గ్రామాలను వెనక్కి ఇవ్వాలని మోదీని కోరినట్లు చెప్పారు.
ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. మేం అడిగిన వాటిని రాతపూర్వకంగా ఇచ్చామని తెలిపారు. తాము చెప్పిన వాటిని వారు సావధానంగా విని… సానుకూలంగా స్పందించారని చెప్పారు. విభజన హామీలను, వివిధ అంశాలను సాధ్యమైనంత త్వరగా అమలు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అమిత్ షాను కలిసినప్పుడు వారి శాఖకు సంబంధించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరామని భట్టివిక్రమార్క తెలిపారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరోకు నిధులు కోరినట్లు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం సహకారం కోరినట్లు చెప్పారు. అవసరమైన మేర ఐపీఎస్‌లను కేటాయించాలని కోరామన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా పరిగణించి నిధులు కోరినట్లు చెప్పారు.
చంద్రబాబుతో భేటీలో…
ఎల్లుండి చంద్రబాబుతో భేటీ సమయంలో ఏం అడగాలో అది అడుగుతామని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. చంద్రబాబుతో సమావేశపు అజెండాలో చాలా అంశాలను పొందుపరిచామన్నారు.
కేంద్రాన్ని కోరినవి…
* గోదావరి పరీవాహక ప్రాంతంలోని కోల్ బ్లాక్స్‌ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలి.
* ఐటీఐఆర్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు… దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి.
* విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలి
* సెమీ కండక్టర్ మిషన్ కోసం సహకరించాలి
* రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లకు నిధులు మంజురు, సహకారం
* పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్ ఇవ్వాలి
* జిల్లాకో నవోదయ పాఠశాల, కస్తూర్భా పాఠశాల
* కుసుం స్కీంలో సోలార్ వంటి ప్రాజెక్టులను కోరిన సీఎం, ఉపముఖ్యమంత్రి
* డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని విజ్ఞప్తి
* విభజన చట్టంలో పొందుపర్చిన షెడ్యూల్ 9, 10లోని అంశాలను పరిష్కరించాలి. ఈ అంశాలపై కేంద్రం చొరవ తీసుకోవాలి.
* స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్‌గా మార్చాలి.
* బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.