Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

కాంస్యం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?

  • హర్యానాకు చెందిన అథ్లెట్ మను భాకర్
  • చిన్నప్పటి నుంచి పలు క్రీడల్లో ప్రావీణ్యం
  • మక్కువతో షూటింగ్‌పైనే దృష్టిసారించిన మను
  • టీనేజ్ నుంచి ఎన్నో పతకాలు సాధించిన షూటర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన షూటర్ మను భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అనేక మంది ఒలింపిక్ మెడల్స్ గెలిచిన అథ్లెట్లను అందించిన హర్యానా రాష్ట్రం ఆమె స్వస్థలం. అయితే హర్యానా అథ్లెట్లలో ఎక్కువగా బాక్సర్లు, రెజ్లర్లే ఉంటారు. వారికి భిన్నంగా మను భాకర్ షూటింగ్‌లో కాంస్యాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ కేటగిరిలో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది. 

నిజానికి టెన్నిస్, స్కేటింగ్ , బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ఆమె ప్రయత్నించింది.  అంతేకాదు ‘తంగ్ టా’ అనే మార్షల్ ఆర్ట్స్‌లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.  అయితే దేనినైనా త్వరగా నేర్చుకునే సహజ లక్షణం ఉన్న ఆమె చివరికి షూటింగ్‌లో ప్రావీణ్యం సాధించి సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడంతో జీవితంలోనే ఆమె అత్యున్నత శిఖరాలను తాకింది. 

పిస్టల్ కావాలని తండ్రిని కోరిన మను భాకర్

2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 సంవత్సరాలే. ఆ సమయంలో ఆమె తొలిసారి షూటింగ్‌ మొదలుపెట్టింది. అనేక క్రీడల్లో రాణించినప్పటికీ షూటింగ్‌నే ఆమె ఎక్కువగా ఇష్టపడింది. షూటింగ్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న వారానికి విషయాన్ని తండ్రికి చెప్పింది. స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కొనివ్వాలని కోరింది. మను భాకర్‌కు అన్ని విషయాల్లో ఎంతో సహకారం అందించే ఆమె తండ్రి పెద్దగా ఆలోచించకుండా తుపాకీని కొనుగోలు చేసి ఇచ్చారు.

మను టీనేజ్ వయసులో ఉన్నప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించింది. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్-1 షూటర్ హీనా సిద్ధూను ఆమె ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. రికార్డు స్థాయిలో ఆమె 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది.

ఇక 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌కు అర్హత సాధించి జూనియర్ కేటగిరిలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 16 ఏళ్ల వయస్సులో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాలు సాధించింది.

ఇక 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను స్వర్ణాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2019లో మ్యూనిచ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో నాలుగవ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ టీమ్ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచింది. 

ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి… క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన భాకర్.. పిస్టల్ పనిచేయకపోవడంతో తదుపరి రౌండ్‌లో వెనుతిరిగింది.

Related posts

ఐపీల్ ఆటగాళ్ల పై బీసీసీఐ కీలక ప్రకటన … ఇబ్బందులు ఉంటె వెళ్లవచ్చు

Drukpadam

పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లిన నీరజ్ చోప్రా…

Ram Narayana

ఐపీఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు… 

Drukpadam

Leave a Comment