Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

యాతలకుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి ….

సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం వద్ద సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి, పనులు ఎంతవరకు జరిగింది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో రూ. 2400 కోట్ల అంచనాలతో 3.75 లక్షల ఆయకట్టుతో పాటు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా జలయజ్ఞం కార్యక్రమంలో చేపట్టిన ప్రాజెక్టు కు అప్పటి ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. స్వరాష్ట్రం వచ్చాక వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ పేరున రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరును, సీతారామ ప్రాజెక్టు గా మార్చి, రూ. 18500 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేసి, రూ. 8000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తాజా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పై ఈ ప్రాజెక్టుకు సంబంధించి, 975 కోట్ల బిల్లులు పెండింగులో వుంచిందన్నారు. డిపిఆర్, టెండర్ల మార్పు తర్వాత రూ. 18500 కోట్లతో అదనంగా వచ్చింది 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే నని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా వీలయినంత తక్కువలో ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. వైరా ప్రాజెక్టు అప్ స్ట్రీమ్ లింక్ చేసి, 9 మండలాల్లోని 1.70 లక్షల ఎకరాల ఆయకట్టు, మైనర్, అనేక లిఫ్ట్ ఇర్రిగేషన్ లకు సంబంధించి ఆయకట్టు స్థిరీకరణకు రూ. 88 కోట్లతో ఏన్కూరు వద్ద 9.6 కి.మీ. మేర లింక్ కెనాల్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనెల 15న ప్రారంభానికి చర్యలు చేపట్టుతున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా, రైతును రాజు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులకు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేసిందని, అకాల వర్షాలు, విపత్తుల వల్ల రైతు నష్టపోకుండా భీమా ప్రభుత్వమే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలుచేశామన్నారు. తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను రాబోయే కొద్దీ రోజుల్లో అర్హులకు అందజేస్తామన్నారు. ధరణి స్థానంలో దేశానికే మోడల్ గా రెవెన్యూ చట్టాన్ని తెస్తామన్నారు. మేధావులు, అనుభవజ్ఞులు తమ సలహాలు డొమైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్. కు అవకాశం ఇస్తే 25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు, అట్టి దరఖాస్తుల పరిశీలన చేయబడలేదని, తమ ప్రభుత్వం రాబోయే 3 నెలల్లో న్యాయమైన, ప్రభుత్వ భూములు కానివి, చెరువు శిఖం కానీ, భూదాన్, వక్ఫ్ భూములు కాకుండా ఉన్న దరఖాస్తులు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. జులై నెలలో గతంలో ఎన్నడూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సర్ ప్లస్ కాలేదని, ఇప్పుడే అయిందని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటీంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పునఃసమీక్ష లో రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యే లు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఇర్రిగేషన్ సిఇ శ్రీనివాస రెడ్డి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై తిరుగుబాటు …

Ram Narayana

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ

Ram Narayana

Leave a Comment