- కొండా సురేఖపై ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం
- తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
- ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, పరస్పర దాడి
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సమయంలో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది పరస్పరం దాడికి దారి తీసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కొండా సురేఖపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్… స్పందించిన హరీశ్ రావు
- మహిళలను గౌరవించడం మన బాధ్యత అన్న హరీశ్ రావు
- మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించరని స్పష్టీకరణ
- కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానన్న హరీశ్ రావు
మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ట్రోలింగ్ మీద బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కొండా సురేఖ పట్ల జరిగిన ఘటనను ఆయన ఖండించారు. ఇలాంటి వికృత చేష్టలు సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని తెలిపారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తాను అయినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి పైశాచిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అందరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.