ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే చేసినట్లుగా భావించొద్దు
- హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
- ఔటర్ రింగ్ రోడ్డు వరకే హైడ్రా పరిమితమని స్పష్టీకరణ
- మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదన్న కమిషనర్
హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే చేసినట్లుగా భావించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హైడ్రా పరిధి హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు వరకే పరిమితమని స్పష్టం చేశారు. కూల్చివేతలన్నీ హైడ్రా చేసినట్లు కాదన్నారు.
ఇతర రాష్ట్రాల్లోని కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదిస్తున్నారన్నారు. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లడం లేదన్నారు. చెరువులు, కుంటలు, నాలాల రక్షణే హైడ్రా కర్తవ్యమని వెల్లడించారు. వరదల్లో రోడ్లు, ఇళ్లు మునగకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు.
మూసీనదిలో ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదన్నారు. మూసీ పరీవాహకంలోని ఇళ్లపై మార్కింగ్‌ను హైడ్రా చేయలేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ఒక ప్రత్యేక ప్రాజెక్టు అని, దీంతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చూస్తోందన్నారు.