ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా వన్ విచారణకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యాలయం గేటు వద్దే బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ శ్రే ణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసుల తీరుపై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
కేటీఆర్ సెల్‌ఫోన్ సీజ్‌కు ఏసీబీ అధికారుల యత్నం.. తీసుకు రాలేదన్న కేటీఆర్
- ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ సుదీర్ఘ విచారణ
- కేటీఆర్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారుల యత్నం
- విచారణకు ఫోన్ తీసుకురాలేదన్న కేటీఆర్, 18లోపు ఇవ్వాలని ఆదేశం
- రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు, జైలుకు పంపాలని చూస్తున్నారంటూ ఆరోపణ
- జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటానన్న కేటీఆర్
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు.
అయితే, తాను ఈరోజు విచారణకు సెల్‌ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ అధికారులకు వెల్లడించారు. దీంతో, ఫార్ములా ఈ-రేసు నిర్వహణ సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లను ఈ నెల 18వ తేదీలోగా తమకు అప్పగించాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆదేశించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ఏసీబీ విచారణ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
“ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని నేను సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్ధమని చెప్పినా స్పందన లేదు” అని కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఒకే ప్రశ్నను పదే పదే అడిగారని, అసలు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని తాను అధికారులనే ప్రశ్నించానని తెలిపారు.
“పైనుంచి ఎవరో రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు నన్ను అడిగారు. రేవంత్ రెడ్డి గతంలో జైలుకెళ్లారు.. ఇప్పుడు మమ్మల్ని కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు” అంటూ కేటీఆర్ ఆరోపించారు. “నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటాను తప్ప భయపడను. ఎన్ని వందల కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా వెరవను” అని ఆయన స్పష్టం చేశారు.