Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నం …ఏడో నిజాం మనమరాలు

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ మనవరాలు ప్రిన్సెస్‌ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు.

అయితే ఆ పత్రాలు, సాక్షులు నకిలీవి అని.. అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయటంతో పాటుగా.. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ముస్లిం పర్సనల్‌ చట్టం ప్రకారం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దుల్హాన్‌ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకొంటున్న వారికి చట్టప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టులను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్‌ ఉందని.. దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్రపన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా కేసు పోలీసులు నమోదుచేయకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా.. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.

కాగా, అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వ తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతోనే ఉండగా.. వాటిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్ ఝా బహదూర్ టర్కీలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన.. విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి దివాలా తీశారు. చివరి రోజుల్లో టర్కీలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడే కన్నుమూశారు.

Related posts

సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించండి …మంత్రి పొంగులేటి

Ram Narayana

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

Ram Narayana

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే…మూడు ప్రాజెక్టులకు రాత్రిపూటే డిజైన్లు…

Ram Narayana

Leave a Comment