- వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కడుపులో సర్జికల్ కత్తెరలు
- 12ఏళ్లుగా పొత్తికడుపు నొప్పితో ఇబ్బందిపడ్డ మహిళ
- శస్త్ర చికిత్స చేసి కత్తెరలను తొలగించిన వైద్యులు
ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్ర ఇబ్బంది పడింది. మహిళ పొత్తికడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత బయటపడింది.
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పికి కారణం కూడా వారు గుర్తించలేకపోయారు. అయితే, ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఆమె పొత్తికడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆసుపత్రి వైద్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.