- దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని అంగీకరిద్దామన్న రాహుల్ గాంధీ
- కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలుతుందని వ్యాఖ్య
- తెలంగాణలోని కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న రాహుల్ గాంధీ
- కులగణన ద్వారానే పేదలకు న్యాయం …రాహుల్ గాంధీ
దేశంలో కులవ్యవస్థ వెళ్ళనుకుని ఉంది ..
కుల లెక్కతేలితే అభివృద్ధికి అవకాశాలు
ఇది పెద్ద కులస్తులకు పట్టదు
దేశం గురించి తాను నిజం చెబితే… దేశాన్ని విభజించడం అవుతుందా? అని లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. కానీ తాను నిజం చెబుతున్నానన్నారు. దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందామని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలిపోతుందని పేర్కొన్నారు.
కులగణన చేస్తామని తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టడం అభినందనీయమని రాహుల్ గాంధీ అన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణన చేసి… జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లను పెంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామన్నారు. కులగణనను వ్యతిరేకించే వారు ప్రజల నుంచి వాస్తవాలను దాచాలని చూస్తున్నారని విమర్శించారు.
కులగణన సందర్భంగా ఏ ప్రశ్నలు అడగాలనేది సామాన్యులే నిర్ణయించాలన్నారు. ఆ ప్రశ్నలను అధికారులు నిర్ణయించకూడదన్నారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదన్నారు. కులగణనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.
కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశంలో కులవ్యవస్థ చాల బలంగా ఉందని అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ అనేది కనిపించదని చెప్పారు. కులగణన ద్వారా ఏళ్లుగా నష్టపోతున్న వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. కుల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థలోనూ అది బలంగా పాతుకుపోయిందని చెప్పుకొచ్చారు. కుల వ్యవస్థ అనేది కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యువత సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితులుఏర్పడుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కులవ్యవస్థ ఇండియాలోనే ఉందని రాహుల్ మండిపడ్డారు. కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని చెప్పారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి …
భారత్ జోడో యాత్ర ఎంతో మందిని కదిలించిందని కులగణన సంప్రదింపుల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని, ఇందిరా గాంధీ ‘గరీబ్ హఠావో’ అనే నినాదంతో చరిత్రలో నిలిచారని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో కులగణన చారిత్రకం కాబోతోందని, రాహుల్ గాంధీ మాట ఇస్తే అది శాసనమని రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణనపై ముందుకెళ్తున్నామని, కులగణన చేసి తెలంగాణ దేశంలో ఆదర్శంగా రాష్ట్రంగా నిలవబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఈ సదస్సు జరిగింది.