- ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు
- 2 వేల సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్న పోలీసులు
- తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో నేరాలు
తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై వివిధ రాష్ట్రాల్లో పదికిపైగా ఇతరత్రా కేసులు ఉన్నట్లు గుర్తించారు. రైళ్లలో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 2వేల సీసీ కెమెరాల పుటేజీ జల్లెడ పట్టి, ఓ జైలు అధికారి తోడ్పాటుతో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఇటీవల గుజరాత్‌లోని ఉద్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ యువతి (19) మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేయగా, ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న ఆమె హత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పలు రాష్ట్రాల పోలీసులను సమన్వయం చేసుకోవడంతో పాటు గుజరాత్ లోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 2వేల సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు.
ఈ క్రమంలో ఓ పుటేజీలో అనుమానితుడి స్పష్టమైన ఫోటో కనిపించగా, సూరత్‌లోని లాజ్ పోర్ సెంట్రల్ జైలు అధికారి అతడిని రాహుల్ జాట్‌గా గుర్తించారు. ఈ క్రమంలోనే వల్సాడ్ జిల్లాలోని వాపీ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా, అతనిని హర్యానాకు చెందిన పాత నేరస్తుడుగా గుర్తించారు.
రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో చోరీలు, ఆయుధాల అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్రలోని రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో మహిళను రాహుల్ దోపిడీ చేసి, హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.