- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం
- సీఎం పదవిపై ఉత్కంఠ
- షిండేకు మోదీ, అమిత్ షా ఫోన్
- సీఎం రేసు నుంచి వెనక్కి తగ్గిన షిండే!
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించినప్పటికీ, సీఎం పదవి ఎవరు చేపట్టాలన్నదానిపై బీజేపీ, శివసేన (షిండే వర్గం) మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదు. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో ఫోన్ లో మాట్లాడారని వెల్లడించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నా అభిప్రాయం తెలుసుకున్నారు అని వివరించారు. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమేనని చెప్పానని తెలిపారు.
ఇక, తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని షిండే అభివర్ణించారు. నన్ను నేను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తా అని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధే తనకు ప్రధానం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా గత రెండున్నరేళ్లుగా చేసిన పనులు సంతృప్తినిచ్చాయని షిండే పేర్కొన్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మళ్లీ తమకే పట్టం కట్టారని వివరించారు. తాను ఎప్పుడూ బాల్ థాకరే మార్గంలోనే పయనించానని తెలిపారు.
కాగా, షిండేకు బీజేపీ హైకమాండ్ ఫోన్ చేయడం, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే… సీఎం రేసు నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మా పార్టీలో చేరాలి: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే
- కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న ఆశిష్ దేశ్‌ముఖ్
- మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిందన్న ఎమ్మెల్యే
- కాంగ్రెస్ నుంచి గెలిచిన 16 మంది బీజేపీలో చేరాలని సూచన
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనందున కమలం గూటికి రావాలని ఆహ్వానించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో తమ కూటమి అద్భుత విజయం సాధించిందని, ప్రతిపక్ష కూటమి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందన్నారు.
కాంగ్రెస్ దారుణ ఓటమిని మనమంతా చూశామని, మహారాష్ట్రలోనే కాదు… చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ ఓడిపోవడం మనం చూశామన్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు భారీగా తగ్గినట్లు తెలిపారు. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలిందని, ఇంకా అందులోనే ఉంటే గెలిచిన ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని సూచించారు.
ఆశిష్ దేశ్‌ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. అతనిని కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో… ఆ తర్వాత బీజేపీలో చేరారు. నాగపూర్‌లోని సావ్‌నర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 220కి పైగా సీట్లు గెలుచుకుంది.