- నేషనల్ లాటరీ టికెట్‌లో జాక్‌పాట్ కొట్టిన యూకే వ్యక్తి
- బ్రిటన్‌లోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ గెలుచుకున్న వైనం
- ఇటీవల నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్లకు జాక్‌పాట్
అదృష్టం అనేది ఎప్పుడు… ఎవరిని… ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపర్ ఆఫర్ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే అంతే. రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. దాంతో అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా ఉన్నావారు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా అవతరిస్తుంటారు. ఇదిగో ఈ బ్రిటన్ వ్యక్తి విషయంలో అదే జరిగింది.
రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకుని ఆ దేశంలోని సంపన్నుల్లో ఒకడిగా మారిపోయాడు. నేషనల్ లాటరీ టికెట్‌లో జాక్‌పాట్ కొట్టాడు. లాటరీ తగలడంతో ఏకంగా 177 మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో సుమారు రూ.1,800 కోట్లు. మంగళవారం నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్లకు ఈ బంపర్ లాటరీ తగిలింది.
బ్రిటన్‌లోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదే. కాగా, 2022 జులై 19న జరిగిన డ్రాలో 195 మిలియన్ పౌండ్లు గెలుచుకున్న విజేత నేషనల్ లాటరీలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇక తాజా విజేత ఈ ఏడాది సండే టైమ్స్ సంపన్నుల జాబితాలోని మ్యుజిషియన్స్ హ్యారీస్టెల్స్ (175 మిలియన్ పౌండ్లు), అడెలె (170 మిలియన్ పౌండ్లు)లను దాటేయడం గమనార్హం. కాగా, విజేత వివరాలను వెల్లడించేందుకు నిర్వాహకులు నిరాకరించారు.