Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు నడుం బిగించిన పవార్‌!

2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు నడుం బిగించిన పవార్‌!
-బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు సమావేశం
-ప్రతిపక్ష పార్టీలను సమావేశానికి ఆహ్వానించిన పవార్‌
-కాంగ్రెస్‌ సహా పలు పార్టీలకు అందిన ఆహ్వానాలు
-ఇప్పటికే తిరస్కిరించిన కపిల్‌ సిబల్‌
-లోక్‌సభతో పాటు యూపీ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చ
-ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అనంతరం సమావేశ ప్రకటన

జాతీయ స్థాయిలో బీజేపీ, ప్రధాని మోదీకి దీటుగా ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీలతో సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారందరికీ ‘రాష్ట్ర మంచ్‌’ తరఫున ఆహ్వానాలు కూడా అందాయి. ఇటీవల తృణమూల్‌ లో చేరిన యశ్వంత్‌ సిన్హా, పవార్‌ ఇరువురూ ఈ భేటీకి నేతృత్వం వహించారు. అందువల్లే యశ్వంత్‌ సిన్హా ఆధ్వర్యంలో నడుస్తోన్న రాష్ట్ర మంచ్‌ తరఫున నాయకులకు ఆహ్వానాలు వెళ్లాయి. అంతకుముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో పవార్‌ భేటీ అయ్యారు. అనంతరమే పార్టీలతో సమావేశానికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నాయకులు వివేక్‌ టంఖా, కపిల్‌ సిబల్‌ సహా పలువురు నేతలకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సిబల్‌, ఝా ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇక తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి ఇప్పటి వరకు ఎలాంటి లేఖ అందలేదు. తొలుత ఈ భేటీకి కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే.. ఈ దేశంలో కాంగ్రెస్‌ రహిత కూటమి ఉండబోదని వ్యాఖ్యానించారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి దీటుగా ఓ నాయకుణ్ని బరిలోకి దింపడంతో పాటు బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. అలాగే ఒక్క లోక్‌సభ ఎన్నికలేగాక వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బలమైన కూటమిని ఏర్పాటు చేసి బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

యూపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. సొంత పార్టీ నేతలే సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై స్వరం పెంచుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. వీరంతా పవార్‌తో టచ్‌లో ఉన్నారని.. ఆయనని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే యూపీలో మద్దతు కూడగట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య పవార్‌ సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts

స్కూటర్​ లేని కేసీఆర్​ కు.. విమానం కొనేంత డబ్బులు ఎక్కడివి?: షర్మిల

Drukpadam

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

Drukpadam

తిరుపతి విమానాశ్రయానికి నీటిసరఫరా నిలిపివేతపై రగడ!

Drukpadam

Leave a Comment