అంతర్జాతీయం

తుర్కియే హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 76 మంది మృతి!

  • తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఘటన
  • ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనంపై నుంచి దూకి కొందరి మృతి
  • స్కూళ్లకు శీతాకాల సెలవులు కావడంతో కిక్కిరిసిన హోటల్
  • ప్రమాద సమయంలో హోటల్‌లో 238 మంది
  • ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరన్న మంత్రి

తుర్కియే (టర్కీ) లోని ఓ 12 అంతస్తుల హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 76 మంది మృతి చెందారు. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనంపై నుంచి దూకి కొందరు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య తుర్కియేలోని పాప్యులర్ స్కీ రిసార్ట్‌‌లోని హోటల్‌లో జరిగిందీ ఘటన. బోలు ప్రావిన్స్ కొరొగ్లు పర్వత ప్రాంతాల్లోని కర్తల్‌కయ వద్దనున్న రిసార్టులోని గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో నిన్న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

స్కూళ్లకు శీతాకాల సెలవులు కావడంతో పర్యాటకులతో హోటళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉందని తుర్కియే అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి అలీ యెర్లికయే తెలిపారు. ఈ ఘటనతో తమ హృదయాలు బద్దలయ్యాయని, ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు.

పై అంతస్తుల్లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడిందని, కొందరు దుప్పట్లు ఉపయోగించి కిందికి దిగేందుకు ప్రయత్నించారని హోటల్ మూడో అంతస్తులో ఉన్న పర్యాటకుడు యెల్కోవన్ తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన 76 మందిని గుర్తించామని, 45 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 238 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదం సంభవిస్తే 4.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Related posts

భారత్ తో కెనడా రహస్య చర్చలు?

Ram Narayana

గాజాలో తీవ్ర కరవు నెలకొంది: అధికారికంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి!

Ram Narayana

పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక…

Ram Narayana