జైల్లో పెడతామని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం: కేటీఆర్
పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్న కేటీఆర్
ఏడాది కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా, విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నా ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఇక ముందు కూడా కొట్లాడతామన్నారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని అన్నారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. పువ్వాడ అజయ్ వంటి నాయకులు ఓడిపోవడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్నారు. ఖమ్మంలో ఇటీవల వరదలు వస్తే అందరికీ పువ్వాడ అజయ్ గుర్తుకువచ్చాడన్నారు. వరదల సమయంలో జిల్లా మంత్రుల వల్ల పైసా ఉపయోగం కనిపించలేదని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామనే అభిప్రాయంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో తాను ఖమ్మంలో పర్యటిస్తానని కేటీఆర్ అన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి – మాజీ ఎంపీ నామ

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల శ్రేణులు, బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొనేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైద్రాబాద్ లో పువ్వాడ నివాసంలో జరిగిన సమావేశంలో నామ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై చొరవగా స్పందిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని నామ సూచించారు. ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కానుకగా ఇవ్వాలన్నారు.
భవిష్యత్ బీఆర్ యస్ దే…మాజీమంత్రి పువ్వాడ

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంవత్సరకాలంలోనే ఐదు సంవత్సరాలు పూర్తీ అయ్యాయని ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తుందని మరి కొద్దిరోజుల్లో అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అన్నారు …ఆరు గ్యారంటీలు అటుకెక్కాయని , రైతు భరోసాకు రామ్ రామ్ చెప్పారని ,2 లక్షల రుణమాఫీపై రైతులు రగిలి పోతున్నారని , మహిళలకు నెలకు రూ 2500 ఏమైయ్యాయని ప్రశ్నించారు ..మున్నేరు వరదల్లో మనమే సహాయం అందించామని పేర్కొన్నారు …ప్రజలు కొద్దీ రోజుల్లోనే పువ్వాడ అజయ్ కావాలని కోరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని మనం ప్రజలు చేసిన మంచి గుర్తుంచు కుంటారని అన్నారు ..ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీఆర్ యస్ విజయం ఖాయమన్నారు ..ప్రజలు కేసీఆర్ పాలనా కావాలని అంటున్నారని అన్నారు …మనం చేయాల్సిందల్లా ప్రజలకు అండగా ఉండటమేనని అన్నారు ..
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బొమ్మెర రామ్మూర్తి, ఖమ్మం కార్పొరేషన్ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాక్బుల్, ఖమ్మం టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, రఘునాథపాలెం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరునాయక్, ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండలం, ఖమ్మం కార్పొరేషన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.