Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్య!

  • దారి కాచి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే మృతి
  • తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్యే కారణమని మృతుడి భార్య ఆరోపణ
  • కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయింపు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (47) గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను గొడ్డళ్లతో నరికి చంపారు.  ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రాజలింగమూర్తిపై గతంలో భూతగాదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి.  ఆయన భార్య సరళ మాజీ కౌన్సిలర్. 2019లో ఆమె భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

రాజలింగమూర్తి నిన్న తన స్వగ్రామమైన జంగేడు శివారులోని పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం బైక్‌పై తిరిగి భూపాలపల్లి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా మంకీ క్యాపులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకుని దాడి చేశారు. ఆపై కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా, తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబే కారణమని సరళ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Related posts

జర్నలిస్ట్ కు రూ.10వేల ఆర్ధికసహాయం అందజేసిన కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్…

Ram Narayana

ముంబైలో పక్కింటి వారితో గొడవ… మహిళ కాల్చివేత..!

Drukpadam

ఏమిటీ సూప్?’ అంటూ రెస్టారెంట్‌ మేనేజ‌ర్ ముఖంపై వేడివేడి సూప్ పోసిన క‌స్ట‌మ‌ర్.. 

Drukpadam

Leave a Comment