సీఎం కేసీఆర్ దళిత బాట …ప్రగతి భవన్ లో అఖిలపక్షం దళితులకు ఏటా 10 వేల కోట్లు
సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ తక్షణమే రూ.1000 కోట్లు కేటాయిస్తాం
నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి
సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పై చర్చ
దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్న కేసీఆర్
ఎస్సీ సాధికారతపై కేసీఆర్ అఖిలపక్ష భేటీ
పేద ఎస్సీ కుటుంబాల అభివృద్ధే లక్ష్యం
ఎస్సీల కష్టాలు తొలగిపోవాలి
దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధమన్న కేసీఆర్
దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానం
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణ విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.రాష్ట్రంలోని నిరు పేద ఎస్సీ కుటుంబాలను అన్ని రంగాల్లో దశల వారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దళిత సాధికారత పథకాన్ని అమలు చేయాలని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాని విధివిధానాల కోసం ఎస్సీ ప్రజాప్రతినిధులు, నేతలతో అఖిలపక్ష సమావేశంలో చర్చించారు . ప్రగతిభవన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ, మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు హాజరయ్యారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్, గడ్డం ప్రసాద్ కుమార్ వంటి పలువురు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర అని, అటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల కష్టాలు తొలగిపోవాలని ఆయన చెప్పారు. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అభిప్రాయపడ్డారు.
ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మరో రూ.500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచన అని సీఎం కేసీఆర్ వివరించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలే పీడిత వర్గాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వారి సామాజిక, ఆర్థిక బాధలను తొలగించడానికి దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని చెప్పారు. ఈ పథకం కోసం నిధులు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యతను తీసుకుందామని పిలుపునిచ్చారు.