రోజా ఇంట్లో రాగిసంగటి, నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్ ఏంమాట్లాడారు?: రేవంత్ రెడ్డి
-బేసిన్లు,భేషజాలు లేవు అని కేసీఆర్ అనలేదా ?
-రాళ్ల సీమ వంటి రాయలసీమను రతనాల సీమ చేస్తా. ప్రతి ఎకరాకు నీళ్లు -అందిస్తా అన్నది ఎవరు ?
-జలవివాదాలపై రేవంత్ స్పందన
-సీఎం కేసీఆర్ పై ఆగ్రహం
-బేసిన్లు లేవు, భేషజాలు లేవన్నారని ఆరోపణ
-విద్యార్థుల ఆత్మబలిదానానికి విలువలేదా అంటూ వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. నీటి వివాదాల అంశం గురించి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ఏమన్నారో గుర్తుచేశారు. ఓసారి సీఎం కేసీఆర్ తిరుమల సందర్శనకు వెళ్లిన సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారని వెల్లడించారు. రోజా పెట్టిన రాగిసంగటి, నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్… బేసిన్లు (నదీ పరీవాహక ప్రాంతాలు) లేవు, భేషజాలు లేవు… రాళ్ల సీమ వంటి రాయలసీమను రతనాల సీమ చేస్తా. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తా అని మాట్లాడారని రేవంత్ ఆరోపించారు. తాను అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిచానని తెలిపారు.
“రోజా ఒక్కసారి రాగిసంగటి, నాటుకోడి పులుసు పెడితేనే కేసీఆర్ ఇంతలా సిగ్గులేకుండా మాట్లాడారు. రోజా పెట్టింది తిని బలిసి, బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని పేర్కొన్న కేసీఆర్ కు, నాడు ఈ బేసిన్ల కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసింది తెలియదా? మనకు రావాల్సిన నీళ్ల కోసం కులాలు, మతాలకు అతీతంగా కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం. బేసిన్లు, భేషజాలు లేకపోతే ఇంత మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాన్ని అప్పుడే మేం ప్రశ్నిస్తే… వాళ్లంతా చిల్లరగాళ్లు, వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని కేసీఆర్, ఆయన భజనబృందం మమ్మల్ని తిట్టింది.
ఆ రోజు కూడా మేం హెచ్చరించాం… ఈ ప్రాజెక్టుల వల్ల తీరని నష్టం, అన్యాయం జరగబోతోందని చెప్పాం. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే నదీ జలాల అంశానికి చట్టబద్ధత కల్పించారు” అని వివరించారు.
రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ 203 జీవో ఇచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడలేదని తెలిపారు. ఎత్తిపోతల పథకానికి రూ.7 వేల కోట్లు కేటాయించినప్పుడూ ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారని వెల్లడించారు. ఈ నెల 9న కేఆర్ఎంబీ సమావేశానికి ఎందుకు వెళ్లరని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా జలాల పరిరక్షణ కంటే పెద్దపనులు కేసీఆర్ కు ఏమున్నాయని నిలదీశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి… గతంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుపైనా ధ్వజమెత్తారు. తెలంగాణకు 34 శాతం కృష్ణా నీళ్లు సరిపోతాయని హరీశ్ రావు అన్నారని రేవంత్ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి హోదాలో హరీశ్ సంతకం కూడా పెట్టారని తెలిపారు. ఏడేళ్ల పాటు 299 టీఎంసీలో వాడుకున్నారని వివరించారు.