- శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం
- ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించే అవకాశం
- సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ముఖ్యమంత్రులు భేటీ
దేశ రాజధాని ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
అంతకుముందు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఇరువురు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అధికారులతో గంటన్నర పాటు సమావేశమయ్యారు.




హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి సమావేశమయ్యారు.
గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్.. 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
ఆ విషయం చర్చకు రాలేదు: చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి!

- బనకచర్ల ప్రాజెక్టు కడతామనే ప్రతిపాదన రాలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి
- అలాంటప్పుడు ఆపాలనే చర్చ కూడా ఉండదని వ్యాఖ్య
- కేంద్రం కేవలం నిర్వాహక పాత్ర పోషించిందన్న రేవంత్ రెడ్డి
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన ఈ సమావేశంలో రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదనే రానప్పుడు దానిని ఆపాలనే చర్చ కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
గతంలో కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు.
టెలీమెట్రీలకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

- రిజర్వాయర్లు, కెనాళ్ల వద్ద టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తామని ఏపీ చెప్పిందని వెల్లడి
- యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పిందన్న మంత్రి
- గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని విమర్శలు
అన్ని రిజర్వాయర్లు, కాలువల వద్ద టెలీమెట్రీలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీలను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని ఆయన అన్నారు.
కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు. టెలీమెట్రీల ఏర్పాటుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
సీఎంల సమావేశం సుహృద్బావ వాతావరణంలో జరిగింది: ఏపీ మంత్రి నిమ్మల

- ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం
- హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు
- సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు
ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న జల వివాదాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ భేటీని ఇరు రాష్ట్రాల సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయని తెలిపారు. కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్‌లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనల్లోని సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జల సమస్యల పరిష్కారానికి ఒక శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఇరు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
ఇక, బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.