భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డు దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సరళమైన విధానం ఉండగా, ప్రభుత్వం దీనికి ముగింపు పలకనుంది.
సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీని ధృవీకరించేందుకు (DOB) అదనపు డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి జతచేయాలి. ఈ మార్పులతో ధృవీకరణ ప్రక్రియ మరింత పటిష్టం కానుంది.
ప్రస్తుతం ఉన్న విధానంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2026 చివరి తేదీ అని సీఎస్‌సీ స్పష్టం చేసింది. గుర్తింపు వివరాలను మరింత కచ్చితంగా నమోదు చేయడం, ఆర్థిక వ్యవస్థలో దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి లక్ష్యాలతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుదారుడి పేరు పాన్ కార్డులో, ఆధార్ కార్డులో అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉండటం తప్పనిసరి. ఈ మార్పుల కోసం ఏప్రిల్ నుంచి కొత్త దరఖాస్తు ఫారాలను జారీ చేయనున్నారు. పాత ఫారాలు చెల్లవని అధికారులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: