తనదృష్టిలో పీసీసీ పదవి చిన్నవిషయం అంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!
ఢిల్లీలో కోమటిరెడ్డి పర్యటన
విజ్ఞాన్ భవన్ లో కిషన్ రెడ్డితో భేటీ
క్యాబినెట్ హోదా పొందడంపై అభినందనలు
పార్టీ మారే ఆలోచనలేదని స్పష్టీకరణ
రేవంత్ చిన్న పిల్లవాడంటూ వ్యాఖ్యలు
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ అద్యక్షపదవికోసం తీవ్రంగా కొట్లాడిన భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు పీసీసీ పదవి తనదృష్టిలో చిన్న పదవి అంటున్నారు. పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి చిన్నపిల్లవాడు అని కూడా అంటున్నారు. మరి చిన్న విషయమైనా పదవికోసం ఆయన ఎందుకు పాకులాడినట్లు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి కి పదవి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పైన అగ్గిమీద గుగ్గిలం అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి 25 కోట్లకు పదవి అమ్ముకున్నారని కూడా ఆరోపణలు గుప్పించారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వాటిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అందజేస్తానని కూడా అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్ లోని కన్వెన్షషన్ సెంటర్ వరకు వెళ్లి షర్మిలకు పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అనేక పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని అయినప్పటికీ పార్టీ మారె ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి విషయం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన మాటే తన వద్ద ఎత్తవద్దని అన్న వెంకట రెడ్డి ఆయన చిన్నపిల్లవాడు అన్నారు. అంటే కాకుండా కాంగ్రెస్ పార్టీ లో సరైన లీడర్ ఎవరు లేరని పేర్కొన్నారు. తాజాగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసి ఆయనకు ప్రమోషన్ లభించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు పార్టీ మారె ఉద్దేశం లేదని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఇటీవల క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందుకున్న కిషన్ రెడ్డిని విజ్ఞాన్ భవన్ లో కలిసిన కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదగా భావించే భువనగిరి కోట అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు.
తన దృష్టిలో పీసీసీ పదవి చాలా చిన్న విషయం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురించి తన వద్ద ఎవరూ ప్రస్తావించవద్దని, తాను రాజకీయాలు మాట్లాడనని ఇటీవలే చెప్పానని వెల్లడించారు. అయినా రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపించే సమర్థవంతమైన నేత లేడని అభిప్రాయపడ్డారు.