పులిచింతల ప్రాజెక్టు వద్దకు బయలుదేరిన జగ్గయ్య పేట ఎమ్మెల్యే ఉదయభాను
-అడ్డుకున్న తెలంగాణ పోలీసులు..
-తెలంగాణ మంత్రులపై ఎమ్మెల్యే మండిపాటు
-పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు సామినేని
-తెలంగాణ సర్కారు అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందన్న ఎమ్మెల్యే
– ఏపీ రైతుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని ఆగ్రహం
– దేవుడు చెప్పినా వినబోమంటూ కేటీఆర్ అంటున్నారని వ్యాఖ్య
పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాదం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలో కాసేపు గందరగోళం నెలకొంది. పులిచింతల వద్ద తెలంగాణ సర్కారు అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఉదయభాను ఆరోపించారు.
ఆ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన తమను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల నిర్మాణం జరిగిందన్నారు. ఏపీ రైతుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రైబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఆయన చెప్పారు.
వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారని, ఆయన తెలంగాణలోనే ఎక్కువ ప్రాజెక్టులు కట్టారని అన్నారు. అటువంటిది ఇప్పుడు తెలంగాణ మంత్రులు నేతలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా మెలగాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచించారని, అయితే, తాము దేవుడు చెప్పినా వినబోమంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికైనా కేటాయించిన ప్రకారం నీటి వాడకలకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు . తమ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే విషయాన్నీ చెబుతున్నారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉండాలని జగన్ కోరుకుంటున్నారని అన్నారు.