- సీపీఐ సీనియర్ నేత సురవరంకు కన్నీటి వీడ్కోలు
- అధికార లాంఛనాలతో అంతిమయాత్ర
- ఎర్ర జెండాలతో పాల్గొన్న సీపీఐ కార్యకర్తలు
- గన్ సెల్యూట్ సమర్పించిన పోలీసులు
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిసింది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, వేలాది మంది కార్యకర్తలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేసి ఆదర్శంగా నిలిచారు.
హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ నుంచి సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసు బ్యాండ్ వాయిద్యాల నడుమ సాగిన ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు ఎర్ర జెండాలతో పాల్గొన్నారు. ‘కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. పూలతో అలంకరించిన వాహనంపై ఉంచిన ఆయన పార్థివదేహానికి ‘లాల్ సలాం’ చెబుతూ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్దకు యాత్ర చేరుకున్న తర్వాత, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యులు సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రి వర్గాలకు అప్పగించారు.
అంతకుముందు, మఖ్దూం భవన్‌లో ఉంచిన సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ వంటి అనేక మంది నేతలు ఆయనకు తుది నివాళులర్పించారు.
83 ఏళ్ల సుధాకర్ రెడ్డి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. కార్మిక వర్గం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నేతగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. సుధాకర్ రెడ్డి కుటుంబం ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసింది.
సురవరం సుధాకర్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

- పీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
- సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప నేత సురవరం అని కొనియాడిన ముఖ్యమంత్రి
- సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ
- గద్దర్, జైపాల్ రెడ్డిల మాదిరిగానే సురవరంకు సముచిత గౌరవం ఇస్తామని వెల్లడి
- మగ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ నేతలతో సీఎం భేటీ, సేవలు స్మరణ
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. నిరుపేదలు, బహుజనుల పక్షాన నిలిచిన గొప్ప నేతను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో ఉంచిన సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీపీఐ జాతీయ నాయకులు డి. రాజా, కె. నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషాతో మాట్లాడి సురవరం గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాల వరకు ఒకే సిద్ధాంతంతో, నిరాడంబరంగా జీవించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ అహంకారం దరిచేరనీయలేదు. పాలమూరు బిడ్డగా బూర్గుల, జైపాల్ రెడ్డిల కోవలో ఆయన జిల్లాకు ఎంతో పేరు తెచ్చారు,” అని కొనియాడారు.
సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని గతంలో సుధాకర్ రెడ్డి కోరగానే తక్షణమే అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. “విలువలతో కూడిన నాయకులను గౌరవించుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, గద్దర్, జైపాల్ రెడ్డిల పేర్లను చిరస్థాయిగా నిలిపాం. అదే విధంగా సుధాకర్ రెడ్డి గారిని కూడా శాశ్వతంగా గుర్తుంచుకునేలా సముచిత నిర్ణయం తీసుకుంటాం,” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన సంతాప సందేశాన్ని పంపినట్లు సీఎం తెలిపారు.
సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన సురవరం పార్థివ దేహం వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సురవరం చిత్రపటం వద్ద తన సంతాప సందేశాన్ని రాశారు.
రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా, ఒక సీనియర్ నేతకు గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మగ్దూం భవన్‌కు వెళ్లారు. అక్కడ సురవరం భౌతికకాయానికి అంజలి ఘటించి, ఆయన ప్రజాసేవను స్మరించుకున్నారు. దశాబ్దాల పాటు వామపక్ష ఉద్యమంలోనూ, పార్లమెంటు సభ్యునిగానూ సురవరం సుధాకర్ రెడ్డి దేశానికి, తెలుగు ప్రజలకు అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇవాళ ఆయన అంతిమయాత్ర జరగనుంది. అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు.

పలువురి ప్రముఖుల నివాళులు …

సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులు అర్పించినవారిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబీ ,ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు , కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. వీరయ్య ,రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ,సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా,జాతీయ కార్యదర్శులు కె .నారాయణ , అజిజ్ పాషా,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె .సాంబశివరావు , చాడ వెంకట రెడ్డి ,పల్లా వెంకటరెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ,పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీలు మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి , ప్రొఫెసర్ కోదండరాం ,విమలక్క బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామారావు , టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీ , ఉపప్రధాన కార్యదర్శి కె .రాములు ఉన్నారు …ఉదయం నుంచే ముగ్ధం భవనం పరిసరాలు మహానేత కడసారి చూపుకోసం కిక్కిరిసి పోయాయి..దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడంతో బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు …