కూరగాయల వ్యాపారి డబ్బు ఎలుకల పాలవడంపై స్పందించిన కేటీఆర్
ఆ నోట్లు స్వాధీనం చేసుకొని అంత డబ్బు ఈ పేదవాడికి ఇవ్వాలని ఆదేశం
-జిల్లా కలెక్టర్ కు భాద్యత అప్పగింత
ఆపరేషన్ కోసం దాచుకున్న రూ. 2 లక్షలు ఎలుకల పాలు..
ముక్కలు చేసిన మూషికాలు!మహబూబాబాద్ జిల్లాలో ఘటన
కడుపులో కణతికి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు
బోరున విలపిస్తున్న బాధితుడు
రిజర్వు బ్యాంకుకు వెళ్లాలన్న స్థానిక బ్యాంకు అధికారులు
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు ముక్కలు చేసిన ఘటన తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఈ ఘటన గురించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల వ్యాపారి రెడ్యానాయక్ నుంచి ముక్కలైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని, తగిన ఆర్థికసాయం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను కేటీఆర్ ఆదేశించారు.
అటు, ఈ విషయంలో మరో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. రెడ్యానాయక్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. డబ్బుల విషయంలో ప్రభుత్వం తగిన సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. చికిత్సపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో అధికారులు బాధితుడు రెడ్యానాయక్ ను కలిశారు. ఎలుకలు కొరికివేసిన కరెన్సీ నోట్లను పరిశీలించారు.
కూరగాయల వ్యాపారం చేసుకునే రెడ్యానాయక్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును చికిత్స కోసం దాచుకున్నాడు. అయితే ఎలుకలు ఆ డబ్బును కొరికి ముక్కలు చేయడంతో అతడు హతాశుడయ్యాడు. ఎలుకలు కొరికిన నోట్లను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అనేకమందిని కదిలించింది.
అసలు ఏమి జరిగింది…….
కడుపులో కణతికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు కూడబెట్టుకున్న 2 లక్షల రూపాయల సొమ్మును ఎలుకలు కొట్టేసి పనికిరాకుండా చేశాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో జరిగిందీ ఘటన. స్థానికంగా నివసిస్తున్న భూక్య రెడ్యా కడుపులో కణతితో బాధపడుతున్నాడు. దానిని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే రెడ్యా.. ఓవైపు బాధను భరిస్తూనే కూరగాయలు అమ్ముతూ డబ్బులు కూడబెడుతూ వస్తున్నాడు.
దీనికి తోడు కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొచ్చి మొత్తం రూ. 2 లక్షలను బీరువాలో భద్రపరిచాడు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన రెడ్యా బీరువాలోని డబ్బులను చూసి హతాశుడయ్యాడు. ఎలుకలు వాటిని ముక్కలుముక్కలుగా కొట్టేయడంతో లబోదిబోమన్నాడు. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు పనికిరాకుండా పోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆ డబ్బును తీసుకుని గత నాలుగు రోజులుగా మహబూబాబాద్‌లోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. రిజర్వు బ్యాంకును సంప్రదించాలని చెప్పిన అధికారులు.. అక్కడ కూడా పని జరుగుతుందని చెప్పలేమని అనుమానం వ్యక్తం చేయడంతో బాధితుడు భూక్య కన్నీటి పర్యంతమయ్యాడు.