పంజాబ్ సీఎంకు సిద్ధూ సారీ చెప్పాల్సిందే: అమరిందర్ సహచరుల డిమాండ్
-అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ థుక్రాల్ ట్వీట్
-పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో విభేదాలు
-సిద్ధూని కలవబోనని అమరీందర్ పంతం
-సామాజిక మాధ్యమాల్లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై తగ్గని ఆగ్రహం
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రముఖ క్రికెటర్ , మాటల మరాఠి నవజ్యోత్ సింగ్ సిద్దు ను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభిప్రాయాలను కూడా పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నవజ్యోత్ సింగ్ సిద్దు పట్ల మొగ్గు చూపింది. దీన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్ సీఎం కనీసం సిద్దు కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదు. సింధు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు ముందు క్షపణ చెప్పిన తరువాత కెప్టెన్ కలిసే అవకాశం ఉందని ఆయన అనుయాయిలు చెబుతున్నారు. ఉప్పు నిప్పు గా ఉన్న వీరికలయక సాధ్యమౌతుందా ? లేదా ?అనేది ఆశక్తిగా మారింది…..
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వర్గం సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూకి బాధ్యతలు అప్పగించడం పట్ల అమరీందర్ సింగ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు కలవబోనని కొన్ని రోజులుగా ఆయన అంటున్నారు. ఇప్పటికీ అమరీందర్ దీనిపై వెనక్కి తగ్గడంలేదు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ థుక్రాల్ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిని సిద్ధూ కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగారని వస్తోన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్ సింగ్ వెనక్కి తగ్గబోరని ఆయన చెప్పారు.