Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

ఒక్క వీర్యదాత.. 200 మంది చిన్నారులకు క్యాన్సర్ ముప్పు!

  • దాతలోని ప్రమాదకర జన్యు లోపం చిన్నారులకు సంక్రమణ
  • ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి కొందరు చిన్నారుల మృతి
  • 14 దేశాల్లోని 67 క్లినిక్‌లలో ఈ వీర్యం వినియోగం

ఐరోపా వ్యాప్తంగా ఓ వీర్యదాత కారణంగా సుమారు 200 మంది చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించడంతో ఈ తీవ్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీర్యంతో గర్భం దాల్చిన వారిలో కొందరు చిన్నారులు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి మరణించినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది.

డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి వీర్యంలో TP53 అనే జన్యువులో లోపం ఉంది. ఈ లోపం వల్ల పుట్టే పిల్లలకు ‘లీ-ఫ్రామినీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వస్తుంది. దీనివల్ల 60 ఏళ్లు వచ్చేసరికి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 90 శాతం వరకు ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల క్యాన్సర్ వంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి.

2005లో ఓ విద్యార్థి వీర్యదానం చేయగా, అతడి నమూనాలను 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. ఆ సమయంలో నిర్వహించిన సాధారణ స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ జన్యు లోపాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ ఈ వీర్యాన్ని 14 దేశాల్లోని 67 క్లినిక్‌లకు సరఫరా చేసింది.

ఈ ఏడాది వైద్య నిపుణులు ఈ అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 మంది చిన్నారులు ఈ దాత వీర్యంతో పుట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో వీర్యదాతల స్క్రీనింగ్, దేశాల మధ్య సంతాన సాఫల్య చికిత్సలపై ఉన్న నిబంధనలలోని లోపాలు బయటపడ్డాయి. యూకేలో ఒక దాత వీర్యాన్ని గరిష్ఠంగా 10 కుటుంబాలకు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉండగా, ఇతర దేశాల్లో అలాంటి కఠిన నియమాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ జన్యు లోపంతో బాధపడుతున్న కుటుంబాలను వైద్యులు నిశితంగా పరిశీలిస్తూ, క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related posts

తాగునీటి కాలుష్యం.. వృషణాల క్యాన్సర్ బారినపడ్డ యువకుడు…

Ram Narayana

రోజుకు 10 గంటలకు పైగా కూర్చుంటే మరణ ముప్పు!

Ram Narayana

లోబీపీని తక్కువ అంచనా వేయొద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!

Ram Narayana

Leave a Comment