జాతీయ రాజకీయ వార్తలు

గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలనీ సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్

పనికిరాని ,పనికిమాలిన గవర్నర్ల వ్యవస్థను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా విమర్శించారు .బ్రిటిష్ వారి వారసత్వం నుంచి వచ్చిన గవర్నర్ల వ్యవస్థ పై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయని అన్నారు .ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మూడు రోజులుగా ఖమ్మంలో జరిగిన సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టదని ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తెలిపారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారని ఆయన తెలిపారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని ఈ సమయంలో వెనుజులాకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. వెనుజులాపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్పై ఒత్తిడి తీసుకు వస్తున్నా మోడీ స్పందించడం లేదని నోరు మెదిపే సాహసం కూడా చేయలేకపోతున్నారని రాజా ఆరోపించారు. పాలస్తీనా, వెనుజులాలకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు.

భారతదేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని కానీ దేశంలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా ప్రయత్నిస్తుందని రాజా తెలిపారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక జనులను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఇటువంటి సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టులు, ఓడరేవులు, అగ్రికల్చర్, అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని రాజా తెలిపారు. ఎన్ఆర్జిఎస్ పథకాన్ని పోరాడి సాధించుకుంటే దానిని రద్దు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుందని ఇందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేస్తుందన్నారు. సంఘ్ పరివార్ శక్తులు కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయని వీటికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సనాతన ధర్మం, మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన తెలిపారు.

విద్య రంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని విద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని రాజా తెలిపారు. పార్లమెంటును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని బిజెపి పాలన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సాగుతుందని ఆయన తెలిపారు. దేశంలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సమైక్య పోరాటం చేస్తామన్నారు. కేరళను కాపాడుకోవడంతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిసి వచ్చే శక్తులతో కలిసి బలాన్ని పెంచుకుంటామన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం అంటే త్యాగాలు, పోరాటాలేనని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు, పోరాటాలకు సమాయత్తం అవుతామని రాజా తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కె సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు ..

ప్రజా ఉద్యమాలకు పునరంకితమవుతున్నామని భవిష్యత్తులో విస్తృత ప్రాతిపదికన ప్రజా ఉద్యమాలను నిర్వహించనున్నామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తెలిపారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో -జరిగిన జాతీయ స్థాయి సమావేశాలు ముగిసిన సందర్భంగా బుధవారం సాయంత్రం సిపిఐ నాయకులు బెలూన్లు ఎగురవేశారు. -సమావేశ స్థలం వద్ద ఎర్రటి బెలూన్లకు సిపిఐ జెండాలు కట్టి గాలిలోకి ఎగురవేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ -సందర్భంగా రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కార్యాచరణ చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కె సాబీర్పాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, పలువురు రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాట్లు ఒకే …

Ram Narayana

డీకేకు సీఎం పోస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ హాట్ కామెంట్స్!

Ram Narayana

కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

Ram Narayana