ప్రమాదాలు ...

బొగ్గు గనిలో పేలుడు…16 మంది మృత్యువాత…

  • మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు
  • ఘటనలో 16 మంది కార్మికులు మృతి
  • మృతుల్లో ఎక్కువ మంది అసోం వాసులుగా అనుమానం
  • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

మేఘాలయలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించడంతో, 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

వార్తా సంస్థల కథనాల ప్రకారం, గని లోపల ఈ పేలుడు జరగడంతో కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అసోం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని కటిగొరా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ దుర్ఘటన గురించి తెలియగానే మేఘాలయ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గనిలోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మేఘాలయలో తరచూ జరుగుతున్న చట్టవిరుద్ధమైన ‘ర్యాట్-హోల్’ మైనింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

బొగ్గు గని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి… మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

Narendra Modi Expresses Grief Over Coal Mine Accident
  • మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు, 16 మంది కార్మికులు మృతి
  • ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు సాయం
  • ఘటనపై సమగ్ర విచారణకు మేఘాలయ ప్రభుత్వం ఆదేశం
  • బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన సీఎం సంగ్మా

మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు సంభవించడంతో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. “ఈస్ట్ జైంతియా హిల్స్‌లో జరిగిన ప్రమాదం నన్ను కలచివేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

ఈ ప్రమాదంపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని, విచారణలో తేలిన అంశాల ఆధారంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని థాంగ్‌స్కూ ప్రాంతంలో ఉన్న అనుమానిత అక్రమ బొగ్గు గనిలో ఈ పేలుడు జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా ఎస్పీ వికాశ్ కుమార్ ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

Related posts

లిఫ్ట్ లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత…

Ram Narayana

జేబులో పేలిన ఫోన్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Ram Narayana

ఏపీలో ఘోర ప్రమాదం .. నలుగురు దుర్మరణం!

Ram Narayana