జాతీయ వార్తలు

కేక్ సిద్ధం చేసుకున్న ఇంట్లో తీరని విషాదం.. గుంతలో పడి యువకుడి మృతి…

  • తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళ కుమారుడి మరణం
  • రక్షణ చర్యలు లేని 15 అడుగుల గొయ్యే మృత్యుపాశం
  • ఢిల్లీ జలమండలి నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం

అది పశ్చిమ ఢిల్లీలోని ఒక మధ్యతరగతి ఇల్లు. టేబుల్‌పై కట్ చేయని కేక్.. వెలిగించని కొవ్వొత్తులు.. నిశ్శబ్దంగా వేచి చూస్తున్న ప్లేట్లు. తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుక కోసం అంతా సిద్ధమైంది. సరిగ్గా అర్థరాత్రి 12:50 గంటలకు కమల్ ధ్యాని (25) అనే యువకుడు తన కవల సోదరుడికి ఫోన్ చేసి తల్లికి ఇమ్మన్నాడు. “అమ్మా.. చపాతీలు సిద్ధం చేయి, మరో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను” అని చెప్పాడు. కానీ ఆ 15 నిమిషాలు కాస్తా నిరంతర నిరీక్షణగా మిగిలిపోయింది. ఆ యువకుడు మరెప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

కాల్ సెంటర్ ఉద్యోగి అయిన కమల్ పని ముగించుకుని తన బైక్‌పై వస్తుండగా జనక్‌పురి వద్ద ఢిల్లీ జలమండలి తవ్విన 15 అడుగుల లోతైన గుంతలో పడి మరణించాడు. సీవరేజీ పనుల కోసం తీసిన ఈ గొయ్యి వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడం, వీధి దీపాలు లేక ఆ ప్రాంతం అంతా చీకటిమయంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తన సొంత సంపాదనతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకే అతడికి చిట్టచివరి ప్రయాణ సాధనమైంది.

అర్థరాత్రి దాటినా కొడుకు రాకపోవడంతో ఆ తండ్రి, సోదరుడు గాలింపు మొదలుపెట్టారు. ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ల వరకు తెల్లవార్లూ తిరిగారు. ఉదయం వెలుగు చూశాక.. గొయ్యిలో పడి ఉన్న కమల్ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. “మా నాన్న రాత్రంతా వెతికారు.. ఉదయం తన కొడుకు శవాన్ని చూశారు” అంటూ కమల్ సోదరుడు కరణ్ కన్నీరుమున్నీరయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. కనీసం బారికేడ్లు, సేఫ్టీ నెట్లు కూడా లేకుండా రహదారిని తవ్వడమే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక ఇంటి సంతోషాన్ని చిదిమేసింది.

Related posts

షాకిచ్చిన ఓయో.. ఇకపై అలాంటి వారికి నో ఎంట్రీ!

Ram Narayana

థార్, బుల్లెట్ నడిపేవారు పోకిరీలే.. హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది, జాగ్రత్త.. సముద్ర తీర ప్రజలకు రజనీకాంత్ హెచ్చరిక

Ram Narayana