- మహిళను ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడైన చాటింగ్ వివరాలు
- అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్లలో సంచలన విషయాలు
- వ్యాపారం, ఇతర అంశాలపై ఇద్దరి మధ్య నిరంతర సంప్రదింపులు
- ఈ ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన అనిల్ అంబానీ ప్రతినిధి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడి, జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, సంభాషణల వివరాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం, 2017 నుంచి 2019 మధ్యకాలంలో వీరి మధ్య పలుమార్లు సంభాషణలు జరిగాయి.
ఈ సంభాషణల్లో అత్యంత వివాదాస్పదమైనది 2017 మార్చి 9న జరిగింది. ఇందులో అనిల్ అంబానీ, “Who do u suggest” (నాకోసం ఎవరిని తీసుకొస్తావు?) అని ఎప్‌స్టీన్‌ను అడిగారు. దీనికి ఎప్‌స్టీన్ స్పందిస్తూ, “a tall Swedish blonde woman, to make it fun to visit” (మీ కోసం ఒక పొడవైన స్వీడిష్ సుందరాంగిని తీసుకొస్తాను) అని సమాధానమిచ్చాడు. ఆశ్చర్యకరంగా, ఈ సందేశానికి అనిల్ అంబానీ కేవలం 20 సెకన్లలోనే “Arrange that” (అయితే ఏర్పాటు చేయి) అని బదులివ్వడం ఈ పత్రాల్లో స్పష్టంగా ఉంది.
ఈ సందేశాలతో పాటు వీరి మధ్య వ్యాపారం, ప్రపంచ వ్యవహారాలు, పారిస్‌లో కలుసుకునే ప్రణాళికల గురించి కూడా చర్చలు జరిగాయి. 2018లో దావోస్‌లో జరిగిన సదస్సులో డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా మాట్లాడుకున్నారు. 2019 మేలో అనిల్ అంబానీ న్యూయార్క్ వస్తున్నట్లు చెప్పగా, తన నివాసానికి రావాలని, అవసరమైన వ్యక్తులతో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తానని ఎప్‌స్టీన్ ఆహ్వానించాడు. వీరిద్దరూ కలుసుకున్నట్లు వారి సహాయకులు కూడా ధృవీకరించారు. అంతేకాకుండా, అనిల్ అంబానీ హాలీవుడ్ కనెక్షన్ల గురించి చెబుతూ, నటి స్కార్లెట్ జోహాన్సన్‌తో తదుపరి సినిమా ఉందని పేర్కొనగా, తనకు “యంగ్ బ్లాండ్స్” (యువరాశులైన అందమైన అమ్మాయిలు) ఇష్టమని ఎప్‌స్టీన్ హాస్యంగా స్పందించాడు.
ఈ ఆరోపణలపై స్పందించేందుకు అనిల్ అంబానీ ప్రతినిధి నిరాకరించారు. ఒకప్పుడు బిలియనీర్‌గా వెలుగొందిన అనిల్ అంబానీ ఆస్తులు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గాయి. భారత్‌లో బ్యాంకు రుణాల ఎగవేత కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో లైంగిక నేరస్థుడిగా ముద్రపడిన ఎప్‌స్టీన్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఎప్‌స్టీన్, విచారణ కొనసాగుతుండగానే జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Save or share this story as a newspaper-style Epaper Clip: