బీ కేర్‌ఫుల్!.. హైదరాబాద్‌లో మళ్లీ వ్యాపిస్తున్న కరోనా!
-తగ్గిందనుకున్న కరోనా … గుంపులు గా ప్రజలు పెరుగుతున్న కేసులు
-గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్న కొవిడ్ రోగులు
-హైదరాబాద్‌లో మాస్కులు ధరించని 40 శాతం మంది
-నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో ముప్పు తప్పదంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో కరోనా వైరస్ మళ్లీ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. నగరంలో ఇటీవల తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గాంధీ ఆసుపత్రికి ప్రతి రోజూ 30కిపైగా కొత్త కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం 361 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, టిమ్స్‌తోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. రెండో దశ ముగిసిందన్న నిర్లక్ష్యానికి తోడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు శుభకార్యాల్లో లెక్కకు మించి పాల్గొంటుండడం కూడా కేసుల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
నిజానికి మే నెల వరకు అల్లాడించిన కరోనా ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఇక రెండో దశ ఖతమైపోయి, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఓ నిర్ణయానికి వచ్చేశారు. భౌతిక దూరం, మాస్కులు వంటి వాటిని పక్కనపెట్టేశారు. హైదరాబాద్‌లో 40 శాతం మంది మాస్కులు ధరించడం లేదని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల ముందు వరకు గాంధీ ఆసుపత్రికి రోజుకు 10 కేసులు రాగా, ఇప్పుడు 30 నుంచి 40 వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మంగళవారం 46 మంది, బుధవారం 32 మంది చేరారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో 361 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 199 మంది కొవిడ్ రోగులు కాగా, 162 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు. టిమ్స్‌లో 50 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీలో రోజుకు 30 మంది డిశ్చార్జ్ అవుతుండగా, అంతే స్థాయిలో చేరుతున్నారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కేసులు మళ్లీ పెరుగుతున్నాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
తమ వద్దకు వస్తున్న రోగుల్లో 75 శాతం మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోందన్నారు. గాంధీలో కరోనా, బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ప్రత్యేకంగా 400 పడకలు కేటాయించినట్టు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం వీడకుంటే మూడో ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని డాక్టర్ రాజారావు హెచ్చరించారు.